కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణ పేట (Narayanpet) జిల్లా కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్ ప్రియాంక అధ్యక్షతన సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్, వాంతులు, విరోచనాలు టైఫాయిడ్ మొదలగు వ్యాధుల నియంత్రణ చర్యలపై అన్ని శాఖల అధికారులతో చర్చించారు.
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కె. జయ చంద్ర మోహన్ ముందుగా కార్యక్రమం ఉద్దేశ్యాన్ని జిల్లా అధికారులకు తెలిపారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీకాంత్ ఈ కార్యక్రమం మొత్తం వివరాలను పీపీటీ ద్వారా అన్ని శాఖల అధికారులకు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిరంతరంగా డ్రైడే ఆక్టివిటీస్ నిర్వహించాలని సూచించారు.
ప్రతి గ్రామపంచాయతీ, ప్రతి మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ సర్వైలెన్స్ నిర్వహించాలని, శానిటేషన్ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే విద్యార్థులకు పాఠశాలల్లో, హాస్టళ్లలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వైద్య శాఖ అధికారులను ఆమె ఆదేశించారు.
ఈ సమన్వయ కమిటీ సమావేశంలో డీఆర్డీఏ/డీపీఓ వెంకట్ రాములు, డీడబ్ల్యుూఓ రాజేందర్ గౌడ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంపత్ కుమార్, మిషన్ భగీరథ ఈఈ రంగారావు, జిల్లా మత్స్య శాఖ అధికారి రెహమాన్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, మున్సిపల్ కమిషనర్లు శంకర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

