Mobile Popup Ad
Mobile Popup Ad

తమ విద్యాసంస్థల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే విమర్శలు: మాదాసు సంజీవ్

కలం, కరీంనగర్ బ్యూరో: తమ విద్యాసంస్థల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని బీసీ యువజన సంఘం నాయకుడు మాదాసు సంజీవ్ (BC Youth Leader Madasu Sanjeev) మండిపడ్డారు. ఈ మేరకు కరీంనగర్ లో బీసీ సంఘాల కార్యాలయంలో బీసీ సంఘాల సమావేశంలో జిల్లా యువజన సంఘం నాయకులు మాదాసు సంజీవ్ మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన ప్రైవేట్ విద్యా సంస్థల చైర్మన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నీట్ పరీక్షలలో అవకతవకలు జరుగాయని, దానికి బాధ్యులుగా కేంద్ర మంత్రిపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆ చైర్మన్ కు కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, అదిలాబాద్, వరంగల్ జిల్లాలలో అనేక విద్యాసంస్థలు ఉండగా.. విద్యార్థులకు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారో? విద్యార్థులను, తల్లిదండ్రులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో? ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు.

రూ. లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు..

అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్మన్ సంబంధించిన టెక్నో పాఠశాలలో కేవలం అడ్మిషన్ ఫీజు 25 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని, అలాగే ఇతర పాఠశాలలో, కళాశాలలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని సంజీవ్ మండిపడ్డారు. పేద విద్యార్థులను తల్లిదండ్రులను దోచుకుంటున్న ఆ విద్యాసంస్థల చైర్మన్ నీట్ పరీక్షపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సంబంధిత విద్యాసంస్థల చైర్మన్ గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసినా విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు అందరు కలిసి గెలిపివ్వలేదని పేర్కొన్నారు. ఇక్కడ కాకుండా వరంగల్ జిల్లాలో కూడా అక్కడ విద్యా సంస్థ చైర్మన్ ను నిరుద్యోగులు, విద్యార్థులు తల్లిదండ్రులు గెలిపించలేదని తెలిపారు. అందువల్ల సంబంధిత విద్యాసంస్థల చైర్మన్ లకు రాజకీయాలకు అవకాశాలు ఇవ్వకూడదని పిలుపునిచ్చారు.

వారికి ఎలాంటి పదవి ఇచ్చినా ఆ పార్టీకే నష్టం..

విద్యార్థులను, తల్లిదండ్రులను పట్టిపీడించే విద్యాసంస్థల చైర్మన్ లకు ఎలాంటి పదవి ఇచ్చినా ఆ పార్టీకే నష్టం జరుగుతుందన్నారు. ఇలాంటి వారిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని బీసీ సంఘాల పక్షానకోరుతున్నామని కోరారు. గతంలో ఎలక్షన్లో పోటీ చేసిన అనంతరం ఆ యొక్క ఖర్చును విద్యార్థులను తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుకుంటూ ఏకంగా వేలాది రూపాయల ఫీజులను పెంచడం జరిగిందని చెప్పారు. ఇలా తల్లిదండ్రులను విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ఈ విద్యా సంస్థల యాజమాన్యంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తిరగబడాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై విమర్శ చేసిన ఈ అధికార పార్టీకి చెందిన విద్యా సంస్థల చైర్మన్ యొక్క పాఠశాలల, కళాశాల ఫీజులపై అక్రమ వసూళ్లపై కేంద్ర మంత్రులు దృష్టి పెట్టాలని కోరారు.

అధికార పార్టీకి చెందిన విద్యా సంస్థల చైర్మన్ ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించుకొని తన భవన నిర్మాణానికి నిర్మాణ సామగ్రిని తెచ్చుకున్న విషయం బహిరంగమైందని, దీనిపై ఎలాంటి విచారణ జరగలేదని, ఈ విద్యాసంస్థలకు సంబంధించిన దానిపై త్వరలో ఇన్కమ్ టాక్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నామని చెప్పారు. పేద విద్యార్థుల సొమ్మును వారికి అందించేంతవరకు బలహీన వర్గాలను కలుపుకొని ఉద్యమిస్తామని సమావేశం హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, అనుబంధ సంఘాల నాయకులు ఎడ్ల సురేందర్, దుప్పటపల్లి మురళి, వాయిల రాజ్ కుమార్, చింటూ పటేల్, పోకల విజయ్, సాయి కుమార్, చిట్టీమల్ల సాగర్, నరేష్, పూజిత, సరిత, లావణ్య, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>