Mobile Popup Ad
Mobile Popup Ad

సింగరేణి పరిరక్షణ కోసం ‘సేవ్ మణుగూరు’ ఉద్యమం

కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టం(MMDR) ద్వారా.. దేశంలోని బొగ్గు గనులను వేలం వేసి ప్రైవేట్ పరంచేసే కుట్ర జరుగుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni) ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మణుగూరు అంబేద్కర్ సెంటర్‌లో ప్రారంభమైన ‘సేవ్ మణుగూరు’(Save Manuguru) రెండు రోజుల నిరాహార దీక్షల నిరసన శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.

ఆనాడు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఎండీఆర్ చట్టానికి మద్దతు ఇవ్వడం వల్లే నేడు తెలంగాణలోని బొగ్గు బ్లాకులు వేలానికి వచ్చాయని కూనంనేని విమర్శించారు. మణుగూరు మనుగడ కోసం పీకే ఓసి–2 డిప్ సైడ్ బ్లాక్‌ను నేరుగా సింగరేణికే కేటాయించాలని, అలాగే ప్రస్తుత మణుగూరు ఓసిపి మూసివేయకముందే దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్ అనుమతులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. గనులు కేటాయించకపోతే ఇక్కడి శాశ్వత, కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కోల్పోతారని, సింగరేణిపై ఆధారపడి ఏర్పాటైన బీటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్, భద్రాచలం పేపర్ బోర్డ్ వంటి సంస్థల మనుగడ కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.

రాజకీయ జోక్యం వల్లే 140 ఏళ్ల చరిత్ర గల సింగరేణి ఇబ్బందులలో  పడిందని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 56,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్‌లు నెరవేర్చకుంటే అన్ని పార్టీలు, యూనియన్ లతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ దీక్షలకు మణుగూరు మెడికల్ షాప్ అసోసియేషన్, తెలుగుదేశం పార్టీ, టీయూసీఐలు మద్దతు ప్రకటించాయి. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కే రాజ్ కుమార్, మిరియాల రంగయ్య, వై రాంగోపాల్, సీపీఐ ఇంచార్జ్ సరెడ్డి పుల్లారెడ్డి సహా పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>