కలం, కరీంనగర్ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు (Putta Madhu) పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారని, ఆయనకు సంబంధించిన పూర్తి ఆస్తుల చిట్టా ప్రస్తుతం తమ ముందు సిద్ధంగా ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం (Gajjela Kantham) సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం కరీంనగర్ (Karimnagar) లోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గజ్జల కాంతం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ రూ. 3 వేల కోట్లు దోచుకుంటే, మంథని మధుకు రూ. 9 వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్‌లు లక్షల కోట్లు సంపాదిస్తే, గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లు వెనకేశారని ఆరోపించారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ కాకముందు పుట్ట మధు ఆస్తులు ఎంత, ప్రస్తుతం ఎంత అనే విషయాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పుట్ట మధు ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
శ్రీపాద రావు పెట్టిన భిక్షతోనే రాజకీయం
దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాద రావు పెట్టిన రాజకీయ భిక్షతోనే పుట్ట మధు ఈ స్థాయికి వచ్చారని గజ్జెల కాంతం గుర్తు చేశారు. ప్రస్తుత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇంటి గేటు వద్ద నిలబడితే, ఆయన దయతో భిక్షగా జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం వచ్చిందని, ఆ పాత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురించి మాట్లాడే నైతిక అర్హత పుట్ట మధుకు లేదని, పుట్ట మధు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.
ఇసుక దందా, గంజాయి వ్యాపారం, హత్య కేసుల ఆరోపణ
కేవలం ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి వేల కోట్ల ఆస్తులు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఇసుక దందా, గంజాయి వ్యాపారాలు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో దళిత వ్యక్తిపై దాడులు చేయించడమే కాకుండా, సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతుల హత్య ఉదంతం వెనుక ఉన్నది నువ్వు కాదా? అని పుట్ట మధును నేరుగా ప్రశ్నించారు. గతంలో మంథని మధును చంపి కాలువలో పడేసింది మీ అనుచరులేనని ఆరోపించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టి ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందని, అందులో రూ.3 లక్షల కోట్లను దోచుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రూ.1.50 లక్షల కోట్ల వ్యయంలో లక్ష కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వేల కోట్ల విలువైన సుమారు 30 వేల ఎకరాల భూములను ఆక్రమించారని మండిపడ్డారు.
రాబోయే రోజుల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బొంద పెడతారని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందంటూ ఆయన ఈ సందర్భంగా రాజకీయ జోస్యం చెప్పారు. పదేళ్ల పాటు దొర కుటుంబాన్ని నమ్మి మోసపోయిన ప్రజలు ఇకపై ఆ పార్టీని మరో పదేళ్లయినా నమ్మే పరిస్థితి లేదని గజ్జెల కాంతం వ్యాఖ్యానించారు. తాను గనుక నోరు తెరిస్తే తట్టుకోలేక ఊరేసుకునే పరిస్థితి వస్తుందని, కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని పుట్ట మధుకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సముద్రాల అజయ్, కేశవేని రవీందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

