కలం, వెబ్ డెస్క్ : తమ అధినేత పవన్ కళ్యాణ్ కు అన్ని కులాల్లోనూ మద్దతుదారులున్నారని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) తెలిపారు. వైసీపీ కాపు నేతల సమావేశంపై ఆయన స్పందిస్తూ తాజా వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నేతలు సమావేశం అయ్యారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించి కాపులకు దగ్గర కావాలని చూస్తున్నారని ఆరోపించారు.
సమాజం బాగుండాలని ఎప్పుడూ కోరుకునే తమ నాయకుడిని కులం చట్రంలో బంధించాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని కందుల దుర్గేశ్ మండిపడ్డారు. కులాల మధ్య ఐక్యత ఉండాలన్నదే జనసేన మూల సిద్ధాంతం అని పేర్కొన్నారు. వైసీపీ కుతంత్రాలను బద్దలుకొట్టే మొదటి దెబ్బ కాపు యువతదేనని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు కాపులను గాలికి వదిలేసిందన్న ఆయన.. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ కు ఇచ్చిన నిధులెన్ని? అని వైసీపీ కాపు నేతల్ని ప్రశ్నించారు. ఏపీలో రోజురోజుకు కూటమికి మద్దతు పెరుగుతోందని… అందుకే వైసీపీ నేతలకు భయం పట్టుకుందని, ఈ క్రమంలోనే కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

