కలం, హనుమకొండ : హనుమకొండలో (Hanumakonda) చైన్ స్నాచర్‌లు మరోసారి రెచ్చిపోయారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌బీహెచ్ కాలనీలో (SBH Colony) ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 69 ఏళ్ల పుష్పలత అనే వృద్ధ మహిళ ఇంటి సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. క్షణాల్లోనే ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనతో షాక్‌కు గురైన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సంఘటనా స్థల పరిసరాలలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ సూచించారు. చైన్ స్నాచింగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

