కలం, హనుమకొండ: హనుమకొండ (Hanumakonda)లోని కాకతీయ అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ (KUDA) కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కుడా కార్యాలయంలో ప్రభుత్వ భూముల వేలంపాటకు ఏర్పాట్లు జరిగాయి. దీంతో బీజేపీ (BJP) నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూముల వేలం పాటను ఆపాలని నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి పోలీసులు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.
గతంలో బీఆర్ఎస్ పాలనలో చాలా భూములను ఆక్రమించుకోవడంతో పాటు లీజుకు ఇచ్చుకున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన భూములను ఆక్రమించుకునేందుకు కుట్రలు చేస్తోందన్నారు. బాల సముద్రం చుట్టు పక్కల రూ.1.3 లక్షలకు గజం ఉంటే రూ.60 వేలకు గజం అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు అమ్ముకుంటు పోతే ప్రజలకు ఏం ఉంటుందని ప్రశ్నించారు. ఈ ఆందోళనతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులను సంతోష్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

