కలం, వెబ్ డెస్క్: నేటి ఆధునిక కాలంలో మన జీవన శైలిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. మనం ఏ పనిని అయినా నిర్దిష్ట సమయంలో చేయడం అలవాటు చేసుకున్నాం. ఈ క్రమంలోనే చాలా మందికి భోజనం కూడా రోజూ నిర్దిష్ట సమయానికి చేయడం అలవాటుగా మారిపోయింది. ఉదయం 9 గంటల సమయం కాగానే టిఫిన్, మధ్యాహ్నం ఒంటిగంట కాగానే లంచ్ ఇలా టైమ్ కు తినేస్తూ ఉంటారు.
అయితే ఆకలి వేసినప్పుడు టైమ్ కు తినడంలో తప్పులేదు. కానీ కొంత మంది ఆకలి లేకపోయినా సమయం అయిందని తింటుంటారు (Eating Without Hunger). ఇలా ఆకలి లేనప్పుడు భోజనం చేయడం మంచిదేనా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీని గురించి న్యూట్రిషనిస్ట్ నిపుణులు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా మనకు ఆకలి లేనపుడు భోజనం చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు. సాధారణంగా మానవ శరీరం ఒక యంత్రం లాంటిది. శరీరానికి శక్తి కావాల్సి వచ్చినప్పుడు అది ఆకలి రూపంలో మనకు సంకేతాలు పంపుతుంది. వెంటనే మనం ఆకలి వేసిందని గుర్తించి తినడం చాలా ముఖ్యం. అయితే కొన్నిసార్లు పొట్టలో ఖాళీ లేనప్పుడు ఆకలి వేయదు. అలా ఆకలి లేనప్పుడు కూడా కొద్దిమంది బలవంతంగా ఆహారాన్ని తీసుకుంటారు. దీనివల్ల జీర్ణక్రియ మందగించడంతో పాటు గ్యాస్, ఎసిడిటీ, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
అలాగని మీల్స్ పూర్తిగా మానేయడం కూడా మంచిది కాదట. ఆకలి లేదని చెప్పి టిఫిన్ లేదా లంచ్ పూర్తిగా మానేయకూడదని చెబుతున్నారు. ఎందుకంటే చాలా గంటల పాటు ఏమి తినకుండా ఉండడం వలన తర్వాత ఒకేసారి తీవ్రమైన ఆకలి వేస్తుంది. అప్పుడు మనం అవసరమైన దానికంటే ఎక్కువగా తినేస్తాం. ఈ అలవాటు వల్ల షుగర్ లెవెల్స్ పెరగడం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.
ఆకలి లేనప్పుడు ఏం చేయాలి?
అందుకే ఆకలి లేనపుడు పూర్తిగా తినడం మానేయకుండా తక్కువ మొత్తంలో వెజిటబుల్ సలాడ్, పండ్ల ముక్కలు, మజ్జిగ లేదా ఓట్స్ లాంటి ఆహారాలు తీసుకోవడం ఉత్తమ మార్గం అని చెబుతున్నారు. దీనివల్ల శరీరానికి శక్తి అందుతుంది, అదే విధంగా జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడకుండా ఉంటుందని తెలిపారు.
అయితే కొంత మందికి కొన్ని రోజుల పాటు ఆకలి వేయకుండా ఉంటుంది. అలాంటి వారు వెంటనే అలర్ట్ అవ్వాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఏదో ఒకరోజు ఆకలి లేకపోతే పెద్ద సమస్య కాదు కానీ.. ప్రతిరోజూ సమయానికి ఆకలి వేయకపోవడం, తినాలనే కోరిక పూర్తిగా చనిపోవడం జరుగుతుంటే మాత్రం దాన్ని తీవ్రంగా పరిగణించాలని చెబుతున్నారు. జీవక్రియలు దెబ్బతినడం, లివర్ సమస్యలు, మానసిక ఒత్తిడి లేదా హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటి సమస్యలు ఉన్నప్పుడు ఆకలి వేయదని సూచిస్తున్నారు. అందుకే తరచుగా ఆకలి లేనివారు దానికి గల అసలైన కారణం ఏంటో తెలుసుకుని జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు నిపుణులు.

