కలం, కరీంనగర్ బ్యూరో: ప్రధాని నరేంద్రమోదీ రాబోయే 2047 సంవత్సరం వరకు భారత ప్రధానమంత్రిగా కొనసాగుతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) అన్నారు. ప్రపంచంలోనే భారత్ ను విశ్వగురు స్థానంలో నిలబెట్టే వరకు మోదీ విశ్రమించబోరని చెప్పారు. భారత ప్రధానిగా 4398 రోజులు పూర్తి చేసుకుని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ రికార్డును మోదీ బద్దలు కొట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం ఉదయం కరీంనగర్ లోని శ్రీమహాశక్తి ఆలయంలో స్థానిక బీజేపీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మోదీ (PM Modi) ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, అభివృద్ధిలో భారత్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న మోదీకి భగవంతుడి ఆశీస్సులు అందించాలని కోరుతూ బండి సంజయ్ ఈ పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక బీజేపీ కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
‘‘దేశ ప్రధానిగా 4,398 రోజులు ప్రధానిగా పూర్తి చేసుకుని జవహార్ లాల్ నెహ్రూ రికార్డును బద్దలు కొట్టి అత్యధిక కాలం ప్రధానిగా చేసిన మహానుభావుడు నరేంద్రమోదీ. ఈ నేపథ్యంలో నాతోపాటు ఎంతో మంది దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నెహ్రూ పాలనలో అవినీతి, అరాచకాలు, అస్తవ్యస్త, బంధుప్రీతి పాలన కొనసాగింది. కానీ మోదీ పాలనలో అందుకు భిన్నంగా అవినీతి, బంధుప్రీతికి తావు లేకుండా నిజాయితీ, నిబద్దతతో పాలనను కొనసాగిస్తున్నారని కొనియాడారు. మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుండి బయట పడేశారు. రోడ్లు, రైల్వే, ఎయిర్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో అనూహ్యమైన ప్రగతి సాధించారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు.
అవినీతికి తావులేకుండా సమాజంలోని అట్టడుగునున్న చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత మోదీకే దక్కుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. 2047 వరకు దేశ ప్రధానిగా కొనసాగాలి. మోదీకి అమ్మవారు ఆయురారోగ్యాలతోపాటు శక్తిని కూడా ప్రసాదించాలని కోరుతున్నారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ పత్రాలను తిరస్కరించిన వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోనిది. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది” అని ఈ సందర్భంగా బండి సంజయ్ (Bandi Sanjay) వెల్లడించారు.
Read Also: జడ్జిలపై దాడులు చేస్తే తీర్పులు ఇవ్వలేం: సుప్రీంకోర్ట్
Follow Us On : WhatsApp

