వేద మంత్రోచ్ఛారణలతో మార్మోగిన లక్ష్మీనరసింహుడి యాదాద్రి కొండ

కలం, యాదగిరిగుట్ట : వేద మంత్రాల పఠనం.. భక్తి పారవశ్యం.. ఆధ్యాత్మిక పరిమళం.. ఇలా యాదాద్రి కొండపై అపూర్వ ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. వేకువజామునే వేద మంత్రోచ్ఛారణల నడుమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రం (Yadadri Temple) మార్మోగింది. సుమారు 800 మంది వేదపండితులు, వేద విద్యార్థులు ఒకేసారి గిరి ప్రదక్షిణలో (Giripradakshina) పాల్గొనడంతో యాదగిరికొండ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

శ్రీ జనార్ధనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ వేద విద్వన్మహాసభల్లో భాగంగా ఈ విశేష కార్యక్రమం జరిగింది. తెల్లవారుజామున వేదపండితులు( Vedic Scholars ) , విద్యార్థులు భక్తిశ్రద్ధలతో స్వామివారి గిరి ప్రదక్షిణ చేపట్టారు. అడుగడుగునా వేద మంత్రాలను పఠిస్తూ సాగిన ఈ ప్రదక్షిణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సాధారణంగా భక్తుల గోవింద నామస్మరణలు, జయజయధ్వానాలతో ఆధ్యాత్మికంగా అలరారే యాదాద్రి కొండ.. ఈసారి వందలాది మంది వేదపండితుల మంత్రఘోషతో మరో ప్రత్యేకతను సంతరించుకుంది. వేద స్వరాల ప్రతిధ్వనులతో కొండ పరిసరాలు భక్తిమయంగా మారాయి.

వేద సంప్రదాయ పరిరక్షణే ప్రధాన లక్ష్యం

భారతీయ సంస్కృతి, సనాతన ధర్మానికి మూలస్తంభాలైన వేద సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు, వేద విద్యకు ప్రోత్సాహం కల్పించడం, సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం వెనుక ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. వందలాది మంది వేదపండితులు ఒకే వేదికగా, ఒకే సంకల్పంతో స్వామివారి సన్నిధిలో గిరి ప్రదక్షిణ నిర్వహించడం తెలంగాణ వేద వైభవానికి ప్రతీకగా నిలిచింది. భక్తి, వేద సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాల సమ్మేళనంగా సాగిన ఈ కార్యక్రమం యాదాద్రి క్షేత్ర చరిత్రలో మరో విశేష ఘట్టంగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>