కలం, నారాయణపేట: జిల్లా కేంద్రంలోని (Narayanpet) జనరల్ ఆస్పత్రిలో విషాదం నెలకొంది. ఓ చిన్నారికి ఆరోగ్యం బాగాలేక వైద్యం కోసం వస్తే డాక్టర్లు సకాలంలో వైద్యం అందించకపోవడం వల్ల తమ బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ జనరల్ ఆస్పత్రిలో శనివారం బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామానికి చెందిన కమ్మరి వెంకట్ రాములు కుమార్తె చైత్ర (7) ఆరోగ్యం బాలేదని తెల్లవారుజామున జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు.
వైద్యులు సకాలంలో వైద్యం అందించకపోవడంపై మరో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ కూడా సరైన వైద్యం అందకపోగా తిరిగి జనరల్ ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రికి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే తమ బిడ్డ చనిపోయిందని మృతురాలి తండ్రి వెంకట్ రాములు ఆరోపించారు. సకాలంలో వైద్యం అందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలతో ఉండేదన్నారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.

