కలం, నిర్మల్ : రెండు దశాబ్దాలుగా నిర్మల్ పట్టణంలో తన నివాసంగా చేసుకుని, కారు మెకానిక్‌గా జీవనం సాగిస్తూ ఎంతోమందికి సుపరిచితుడైన ఓ వ్యక్తి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు కారు దగ్ధమైన ఘటనలో (Nirmal Car Fire) తీవ్రంగా గాయపడిన రవి (46) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రవి దాదాపు 20 ఏళ్ల క్రితమే నిర్మల్‌కు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం నటరాజ్‌నగర్‌లో నివాసముంటూ కారు మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నారు. సోఫినగర్‌లో శనివారం ప్రమాదవశాత్తు జరిగిన కారు దగ్ధం ఘటనలో రవి తీవ్రంగా గాయపడటంతో తొలుత జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆయన శిష్యులు, పరిచయస్తులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ మృత్యువుతో చేసిన పోరాటంలో ఆయన ఓడిపోయారు. ఎంతోమందికి మెకానిక్ వృత్తిని నేర్పించి, తన పనితో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రవి అకాల మరణం స్థానికులను కలచివేసింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన దూరం కావడంతో భార్య, ఇద్దరు పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ ప్రమాద ఘటనపై పట్టణ సీఐ సమ్మయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

