కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. అదే అదనుగా భావించిన దుండగులు బరితెగిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇంధన కొరత తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 524 గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీని అపహరించిన (Gas Truck Hijack) ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఝాన్సీ జిల్లాలో జరిగిన ఈ భారీ దోపిడీ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బీపీసీఎల్ (BPCL) ప్లాంట్ నుండి సుమారు 18 లక్షల రూపాయల విలువైన 524 గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో ఒక ట్రక్కు కాన్పూర్‌కు బయలుదేరింది. అయితే మార్గమధ్యంలోనే మాటు వేసిన దుండగులు లారీని అడ్డగించి డ్రైవర్‌ను భయభ్రాంతులకు గురిచేసి వాహనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాము వెళ్తున్న మార్గం ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు లారీలోని జీపీఎస్ (GPS) వ్యవస్థను ధ్వంసం చేసి మరీ ఈ అపహరణకు పాల్పడ్డారు. గ్యాస్ కొరతను సాకుగా చూపి బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరకు విక్రయించేందుకే ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై (Gas Truck Hijack) లారీ యజమాని నీరజ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. గాలింపు చర్యల్లో భాగంగా పారీచా హైవే సమీపంలో సిలిండర్లు లేని ఖాళీ లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యుద్ధ సమయంలో తలెత్తే ఇంధన డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దోపిడీ జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
Read Also: కాళేశ్వరం కేసుపై కదలిక?… సిటీలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్..
Follow Us On: Instagram

