కలం, వెబ్ డెస్క్: పరీక్షలు, డెడ్‌లైన్లు, పని.. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఒత్తిడి ఎదుర్కొంటూనే ఉంటారు. రోజువారీ జీవితంలో పెరుగుతున్న స్ట్రెస్ మధ్య శ్వాస పద్ధతులు ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొద్దిసేపు చేసే శ్వాస వ్యాయామాలు ఆందోళనను తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయని తాజా సూచనలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని అస్టర్ ఆర్వీ హాస్పిటల్ చీఫ్ ఫిజియోథెరపిస్ట్ పలక్ డెంగ్లా కొన్ని శ్వాస పద్ధతులను (Stress Reduce Techniques) వివరించారు. భావోద్వేగాలు అధికంగా ఉన్నప్పుడు లేదా ఒత్తిడి పెరిగినప్పుడు ఈ పద్ధతులు మనసును ప్రశాంతపరచి ఫోకస్ పెంచుతాయని ఆమె తెలిపారు.
ఒత్తిడిని నియంత్రించడంలో శ్వాస ప్రాధాన్యం
పలక్ డెంగ్లా ప్రకారం.. సరైన శ్వాస పద్ధతుల ద్వారా ఒత్తిడిని నియంత్రించడం చాలా ముఖ్యమని తెలిపారు. దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని ఆమె వివరించారు. దీర్ఘకాలిక స్ట్రెస్ కారణంగా కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరిగి తక్కువ స్థాయి వాపు ఏర్పడుతుందని చెప్పారు. ఇది హైపర్ టెన్షన్, టైప్–2 డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, మెడ, వెన్నునొప్పి, జీర్ణ సమస్యలు, నిద్రలేమి, అలసట వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఆమె వివరించారు. అయితే నెమ్మదిగా, చైతన్యంతో చేసే శ్వాస వ్యాయామాలు నరాల వ్యవస్థను ప్రశాంత స్థితికి తీసుకెళ్తాయని ఆమె తెలిపారు. దీనివల్ల స్ట్రెస్ హార్మోన్లు తగ్గి రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, శరీరం త్వరగా కోలుకునే సామర్థ్యం పెరుగుతుందని వివరించారు.
ఒత్తిడిని తగ్గించే 5 శ్వాస పద్ధతులు
1. డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ (బెల్లీ బ్రీతింగ్)
ఈ పద్ధతిలో ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ పొట్ట పైకి లేచేలా చేయాలి. దీని వల్ల డయాఫ్రాగమ్ సరైన విధంగా పని చేస్తుంది. రక్తపోటు, గుండె స్పందన తగ్గి శరీరం రిలాక్స్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
2. బాక్స్ బ్రీతింగ్
ఈ పద్ధతిలో నాలుగు సెకన్ల పాటు శ్వాస తీసుకోవడం, నాలుగు సెకన్లు ఆపడం, నాలుగు సెకన్ల పాటు విడిచేయడం, మళ్లీ నాలుగు సెకన్లు ఆపడం చేస్తారు. ఇది నరాల వ్యవస్థను ప్రశాంతపరచి స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఒత్తిడి పరిస్థితుల్లో ఫోకస్ పెంచడంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
3. ఆల్టర్నేట్ నోస్ట్రిల్ బ్రీతింగ్
ఈ పద్ధతిలో ఒక నాసిక ద్వారా శ్వాస తీసుకుని మరో నాసిక ద్వారా విడిచేయాలి. తర్వాత నాసికలను మార్చాలి. దీని వల్ల భావోద్వేగాలు సమతుల్యంగా ఉండటంతో పాటు మెదడు రెండు భాగాల మధ్య సమతుల్యత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
4. 4-7-8 బ్రీతింగ్
ఈ పద్ధతిలో నాలుగు సెకన్ల పాటు శ్వాస తీసుకుని, ఏడు సెకన్లు ఆపి, ఎనిమిది సెకన్ల పాటు విడిచేయాలి. ఇది వాగస్ నర్వ్‌ను ఉత్తేజపరచి శరీరాన్ని ప్రశాంత స్థితికి తీసుకెళ్తుంది. దీని వల్ల ఆందోళన తగ్గి లోతైన విశ్రాంతి కలుగుతుందని చెప్పారు.
5. హమ్మింగ్ బ్రీతింగ్ (భ్రమరి తరహా)
సాధారణంగా శ్వాస తీసుకుని విడిచేటప్పుడు మృదువుగా హమ్ శబ్దం చేయడం ఈ పద్ధతి. దీని వల్ల సైనస్ మార్గాలు మెరుగుపడి శరీరానికి లోతైన విశ్రాంతి కలుగుతుందని నిపుణులు తెలిపారు.
శ్వాస వ్యాయామాలు ఎప్పుడు చేయాలి?
నెమ్మదిగా చేసే శ్వాస పద్ధతుల వల్ల గుండె స్పందన స్థిరంగా ఉండటంతో పాటు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుందని పలక్ డెంగ్లా తెలిపారు. దీని వల్ల జ్ఞాపకశక్తి, ఫోకస్, ఆలోచన స్పష్టత, పనితీరు మెరుగుపడే అవకాశముందని చెప్పారు. ఈ వ్యాయామాలను చేయడానికి ఉత్తమ సమయాలను కూడా ఆమె సూచించారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఐదు నిమిషాలు, రాత్రి నిద్రకు ముందు ఐదు నిమిషాలు, అలాగే ఒత్తిడి ఉన్న సమయంలో రెండు నుంచి మూడు నిమిషాలు చేయడం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చని ఆమె వివరించారు. నిపుణుల సూచనల ప్రకారం, రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలకు కేటాయించడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్యానికి కూడా మేలు కలగవచ్చని చెబుతున్నారు.
Read Also: మీ బిజీ లైఫ్ స్టైలే గుండెపోటుకు దారితీస్తోంది: డాక్టర్ వార్నింగ్
Follow Us On: Instagram

