కలం, వెబ్ డెస్క్ : ‘మగపిల్లవాడివి నాట్యమేంటి?’ అంటూ సమాజం చేసిన హేళనలను ఎదుర్కొన్న ఒక యువకుడు, నేడు ప్రపంచ వేదికపై తన ప్రతిభను చాటాడు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ప్రారంభ వేడుకల్లో కథక్ (Kathak) ప్రదర్శన ఇచ్చే స్థాయికి ఎదిగి, విమర్శించిన వారందరి నోళ్లు మూయించాడు. అతడే కుమార్ శర్మ (Kumar Sharma). అవమానాల నుంచి అభినందనల వరకు సాగిన అతడి ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తోంది.
దేవదాస్ సినిమాతో మొదలైన ఇష్టం
పదేళ్ల వయసు ఉన్నప్పుడు ‘దేవదాస్’ సినిమాలో మాధురీ దీక్షిత్ (Madhuri Dixit) నృత్యాన్ని చూసినప్పుడు కుమార్‌కు నాట్యంపై మక్కువ ఏర్పడింది. ఎవరికీ తెలియకుండా రహస్యంగా కాళ్లకు గజ్జెలు కట్టుకుని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అయితే, ఇది గమనించిన చుట్టుపక్కల వారు కుమార్‌ని ఎగతాళి చేయడం ప్రారంభించారు. అబ్బాయిలు ఇలా నాట్యం చేయడం సిగ్గుచేటని, అది కేవలం అమ్మాయిలకే పరిమితమని హేళన చేసేవారు. చివరికి తోటి స్నేహితులు, కొందరు ఉపాధ్యాయులు కూడా అతడిని నిరుత్సాహపరిచారు.
రియాలిటీ షోతో మలుపు
ఎన్ని అడ్డంకులు ఎదురైనా కుమార్ (Kumar Sharma) తన ఆశయాన్ని వదులుకోలేదు. తన ఫిట్‌నెస్, నృత్య శైలిని మెరుగుపరుచుకుంటూ పట్టుదలగా ముందుకు సాగాడు. అనేక ఆడిషన్ల తర్వాత, ఒక టెలివిజన్ రియాలిటీ షోలో అవకాశం వచ్చింది. ఆ అవకాశం అనతడి జీవితాన్ని మలుపు తిప్పింది. గుర్తింపు రావడం మొదలయ్యాక, ఒకప్పుడు విమర్శించిన వారే అతడిని గౌరవించడం ప్రారంభించారు. సాక్షాత్తు తను ఆరాధించే మాధురీ దీక్షిత్ సైతం అతడికి తానే పెద్ద ఫ్యాన్ అని చెప్పడం విశేషం.
కళకు లింగభేదం లేదు
నేటికీ ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, నాట్యాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అతను స్పష్టం చేస్తున్నాడు. కళకు లింగభేదం లేదని, గజ్జెలు కట్టుకున్నంత మాత్రాన పురుషత్వం తక్కువ కాదని అతను నమ్ముతున్నాడు. తన ప్రయాణం ద్వారా ప్రపంచానికి భయం లేని తత్వాన్ని చాటిచెప్పాలని కోరుకుంటున్నాడు. సమాజంలో మార్పు రావాలని ఆశిస్తూ, తన కళా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.
Read Also: ఈ పద్ధతులు పాటిస్తే ఒత్తిడి మాయం..!
Follow Us On: Facebook

