మీ బిజీ లైఫ్ స్టైలే గుండెపోటుకు దారితీస్తోంది: డాక్టర్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: ప్రపంచ జీవనశైలి మారింది. అంతా ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. పట్టుమని పదినిమిషాలు ప్రశాంతంగా గడపాలన్నా కుదరని పరిస్థితి. ఇదే సమయంలో గుండెపోట్లు (Heart Attack) అధికం అవుతున్నాయి. చిన్నాపెద్ద అన్న తేడా లేకుండా గుండెపోటు కబళిస్తోంది. దీంతో హార్ట్‌ఎటాక్ ఆందోళన అందరిలో పెరిగిపోయింది. అయితే మనం గడుపుతున్న ఈ అతి బిజీ లైఫ్ స్టైలే ప్రాణాంతక గుండెపోటులకు ప్రధాన కారణమని కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ భోజ్రాజ్ హెచ్చరించారు. గుండెపోటు అనేది అకస్మాత్తుగా తీసుకునే నిర్ణయాల వల్ల రాదని, మనం రోజూ పాటించే అలవాట్లే (Lifestyle Habits) దీనికి బీజం వేస్తాయని ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

అలవాట్లే అసలు శత్రువులు

మార్చి 12న ఇన్‌స్టాగ్రామ్ వేదికగా డాక్టర్ భోజ్రాజ్ తన 20 ఏళ్ల అనుభవాన్ని పంచుకున్నారు. పని ఒత్తిడి వల్ల అర్థరాత్రి వరకు మేల్కొనడం, మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ ప్రభావం, నిరంతర మానసిక ఒత్తిడి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వివరించారు. పోషకాలు లేని జంక్ ఫుడ్ తీసుకోవడం, ఏటేటా నిద్రపోయే సమయం తగ్గిపోవడం వంటి చిన్న చిన్న మార్పులే కాలక్రమేణా పెద్ద ముప్పుగా మారుతాయని ఆయన తెలిపారు.

శరీరం ఇచ్చే సంకేతాలు

ఈ జీవనశైలి వల్ల కలిగే నష్టం వెంటనే బయటపడదని, కానీ శరీరం కొన్ని సూచనలు ఇస్తుందని ఆయన వివరించారు. రక్తపోటు (Blood Pressure) నెమ్మదిగా పెరగడం, ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పడం, శారీరక శ్రమ లేకపోవడంతో ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వంటివి గుండెపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయని హెచ్చరించారు. ఈ మార్పులు మొదట్లో పెద్దగా అనిపించకపోయినా, లోపల మాత్రం గుండె వ్యవస్థను బలహీనపరుస్తాయని పేర్కొన్నారు.

నివారణే మార్గం

చాలామంది తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండరని, కేవలం బిజీగా ఉండటం వల్లే ఇలాంటి తప్పులు జరుగుతాయని డాక్టర్ భోజ్రాజ్ అభిప్రాయపడ్డారు. గుండెపోటు నివారణ అనేది కేవలం మందులతో మొదలుకాదని, మనం నిద్రపోయే విధానం, తినే ఆహారం, ఒత్తిడిని తగ్గించుకునే పద్ధతులపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. లాబ్ రిపోర్టుల్లో సమస్యలు కనిపించకముందే మన అలవాట్లను సరిచేసుకోవాలని ఆయన సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>