కలం, వెబ్ డెస్క్: ముంబయి-పూణే( Mumbai Pune )ఎక్స్‌ప్రెస్ వేపై 30 గంటల పాటు ట్రాఫిక్ జామ్(Traffic Jam)తో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. ఈ దారిలో మంగళవారం ఓ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో 30 గంటల పాటు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయి, వేలాది మంది ప్రయాణికులు రోడ్డుపైనే చిక్కుకుపోయారు. తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ముంబయి వైపు వెళ్తున్న ఒక గ్యాస్ ట్యాంకర్ రాయగడ్ జిల్లా ఖండాలా ఘాట్ పరిధిలోని అడోషి టన్నెల్ సమీపంలో బోల్తా పడింది. కొచ్చి నుంచి సూరత్‌కు వెళ్తున్న ఈ ట్యాంకర్‌లో 21 టన్నుల ప్రొపిలీన్ గ్యాస్ ఉంది. ప్రమాదంతో గ్యాస్ లీక్ కావడంతో, భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ముంబయి వైపు రహదారిని పూర్తిగా మూసివేశారు.
దీంతో పూణే వైపు ట్రాఫిక్ ఖలాపూర్ టోల్ ప్లాజా వరకు నిలిచిపోగా, ముంబయి వైపు వాహనాలు 10 నుంచి 12 కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వేను రోజుకు సగటున లక్ష వాహనాలు వినియోగిస్తుండటంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ప్రమాదం జరిగిన తర్వాత గ్యాస్ ట్యాంకర్‌లో ఉన్న ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో లీక్ నియంత్రణకు చాలా సమయం పట్టింది. ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక దళం, బీపీసీఎల్‌కు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఉష్ణోగ్రత పెరగకుండా ట్యాంకర్‌పై నిరంతరం నీళ్లు చల్లారు. ప్రమాద ప్రాంతం చుట్టూ 500 మీటర్ల నో మ్యాన్ ల్యాండ్ ఏర్పాటు చేశారు. దాదాపు 21 గంటల తర్వాత గ్యాస్ ఒత్తిడి తగ్గడంతో, మరో ట్యాంకర్‌లోకి గ్యాస్‌ను తరలించారు. ఆ తర్వాత బుధవారం అర్ధరాత్రి సమయంలో ట్యాంకర్‌ను అక్కడి నుంచి తొలగించారు. అర్ధరాత్రి తర్వాత మెల్లగా ముంబయి వైపు ట్రాఫిక్‌ను అనుమతించారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నపిల్లలతో, వృద్ధులతో రాత్రంతా కారులోనే ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఎంఎస్‌ఆర్‌డీసీ అధికారులను ఆదేశించారు.


