ఉద్యోగం పోతే ఇక ప్యాకప్.. ట్రంప్‌ సర్కారు సంచలన ప్రతిపాదనలు!

కలం, నేషనల్ డెస్క్ : అమెరికాలో స్థిరపడిన విదేశీ ఐటీ నిపుణులు, ముఖ్యంగా భారతీయ కుటుంబాలకు ట్రంప్‌ సర్కారు కోలుకోలేని షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నది. హెచ్‌-1బీ (H1B Visa) వీసాదారులు ఉద్యోగం కోల్పోతే కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం లభిస్తున్న 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ను తొలగించడంతోపాటు.. వారి జీవిత భాగస్వాములకు అందుతున్న హెచ్‌-4 వర్క్‌ పర్మిట్ల (EAD)ను పరిమితం చేసే దిశగా అమెరికా హోమ్ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్ఎస్‌ రెండు సంచలన ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది.

60 రోజుల గడువుకూ కోత?

ప్రస్తుతం హెచ్‌-1బీ వీసాదారులు ఏదైనా కారణం చేత ఉద్యోగం కోల్పోతే గరిష్ఠంగా 60 రోజుల వరకు అమెరికాలో ఉండి కొత్త ఉద్యోగం వెతుక్కోవచ్చు. అవసరమైతే వీసా స్టేటస్‌ మార్చుకోవడం లేదా అమెరికా నుంచి వెళ్లిపోవడానికి ఈ సమయం కీలకం. 2017 నుంచి అమల్లో ఉన్న ఈ వెసులుబాటును పూర్తిగా తొలగించేందుకు వైట్ హౌస్‌ సమీక్ష కూడా పూర్తయినట్లు సమాచారం.

6 లక్షల ఉద్యోగాలు ఖాళీ అవుతాయా?

హెచ్‌-1బీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు హెచ్‌-4 డిపెండెంట్‌ వీసా కింద లభిస్తున్న ఉద్యోగ అనుమతులను (EAD) రద్దు చేసే దిశగా డీహెచ్ఎస్‌ మరో ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇది అమల్లోకి వస్తే.. గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ నిపుణుల జీవిత భాగస్వాముల ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో 6 లక్షలకు పైగా ఉద్యోగాలు స్థానిక అమెరికన్లకు అందుబాటులోకి వస్తాయని ‘అమెరికా ఫస్ట్‌’ ఉద్యమానికి చెందిన మద్దతు దారులు ప్రచారం చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఆందోళన వద్దు

ఈ రెండు ప్రతిపాదనలు సిద్ధమైనప్పటికీ, తక్షణమే చట్టంగా మారబోవని వలస చట్టాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ముసాయిదాలను ముందుగా ‘ఫెడరల్ రిజిస్టర్’ లో ప్రచురించి, 30 నుంచి 60 రోజుల పాటు ప్రజలు, నిపుణుల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాతే తుది నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే పాత చట్టాలే అమల్లో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>