ఈ టిప్స్ ఫాలో అయితే గ్యాస్ వాడకం 50 శాతం తగ్గించుకోవచ్చు

కలం, వెబ్ డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం దెబ్బకు ఇండియాలో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. దాదాపు దేశమంతా కూడా ఇప్పుడు వంట గ్యాస్ కష్టాలను ఎలా అధిగమించాలి? అన్న ఆలోచనలోనే ఉంది. ప్రధాన నగరాల్లో హోటళ్లు, హాస్టళ్ల పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఇదే సమయంలో డొమెస్టిక్ గ్యాస్ వాడే వారు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్యాస్ అయిపోతే పరిస్థితి ఏంటి? అని ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో కట్టెపుల్లల పొయ్యిలు, ఇండక్షన్ స్టవ్‌లను ప్రత్యామ్నాయంగా మారాయి. కానీ చాలా మందికి వాటి వినియోగం సరిగా తెలీదు. అయితే కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఇంట్లో గ్యాస్‌ వాడకాన్ని 50శాతం వరకు తగ్గించుకోవచ్చని తెలుసా. అంటే మామూలుగా నెల రోజులు వచ్చే గ్యాస్ బండ.. ఈ టిప్స్ వాడితే నెలన్నర వస్తుంది.

వేస్టేజ్‌ను తగ్గించండి

గ్యాస్ వినియోగం తగ్గించడం అంటే.. గ్యాస్ వాడకుండా ఉండటం కాదు.. రోజూ మన వంటగదిలో అయ్యే గ్యాస్ వేస్టేజీని తగ్గించడం. మన వంటగదిలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఎల్‌పీజీ (LPG) వినియోగాన్ని ఏకంగా 50 శాతం వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రెజర్ కుక్కర్ వాడకం, పప్పు ధాన్యాలను నానబెట్టడం వంటి చిన్న చిన్న అలవాట్లు నెలవారీ ఖర్చును భారీగా తగ్గిస్తాయి. ఆ స్మార్ట్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. ప్రెజర్ కుక్కర్ మ్యాజిక్:

పప్పులు, బీన్స్, మాంసం వంటివి వండటానికి ప్రెజర్ కుక్కర్ వాడటం వల్ల వంట సమయం 30 నుంచి 70 శాతం వరకు తగ్గుతుంది. ఇది నేరుగా గ్యాస్ ఆదాకు దోహదపడుతుంది.

2. నానబెట్టడం మర్చిపోవద్దు:

రాజ్మా, శనగలు వంటివి 8-10 గంటలు, పప్పులు గంట సేపు, బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టడం వల్ల అవి 30-50 శాతం వేగంగా ఉడుకుతాయి. దీనివల్ల చాలా గ్యాస్ మిగులుతుంది.

3. సరైన బర్నర్ ఎంపిక:

చిన్న గిన్నెలకు పెద్ద బర్నర్ వాడటం వల్ల మంట వృథా అవుతుంది. మంట ఎప్పుడూ గిన్నె అడుగు భాగానికి లోపలే ఉండాలి. టీ, తాలింపుల కోసం చిన్న బర్నర్‌ను మాత్రమే వాడండి.

4. మూత పెట్టి వండండి:

వంట చేసేటప్పుడు గిన్నెపై మూత ఉంచడం వల్ల లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఆవిరి బయటకు పోదు. దీనివల్ల 20-25 శాతం ఇంధనం ఆదా అవుతుంది.

5. కూరగాయలను చిన్నగా కోయండి:

కూరగాయ ముక్కలు ఎంత చిన్నగా ఉంటే అంత త్వరగా ఉడుకుతాయి. పెద్ద ముక్కలతో పోలిస్తే చిన్న ముక్కలకు వేడి త్వరగా తగిలి వంట వేగంగా పూర్తవుతుంది.

6. ఒకే మంటపై రెండు రకాలు:

కుక్కర్ వాడేటప్పుడు కింద పప్పు, పైన గిన్నెలో బియ్యం లేదా కూరగాయలు పెట్టి ఉడికించండి. ఇలా ఒకేసారి మల్టీ-కుకింగ్ చేయడం వల్ల గ్యాస్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది.

7. బర్నర్ శుభ్రత ముఖ్యం:

బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయితే మంట సరిగ్గా రాదు. మంట ఎప్పుడూ నీలి రంగులో ఉండాలి. ఎరుపు లేదా పసుపు రంగులో మంట వస్తుంటే గ్యాస్ వృథా అవుతున్నట్లు లెక్క. కాబట్టి తరచూ బర్నర్లను క్లీన్ చేయాలి.

8. ముందే ఆపేయండి:

వంట పూర్తయ్యే 2-3 నిమిషాల ముందే స్టవ్ ఆపేయండి. గిన్నెలో ఉండే వేడి (Residual Heat) తోనే అన్నం లేదా పాస్తా వంటివి పూర్తిగా ఉడుకుతాయి.

9. నాణ్యమైన పాత్రలు:

మందపాటి అడుగు గల గిన్నెలు లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వాడటం వల్ల వేడి సమానంగా వ్యాపిస్తుంది. పల్చటి పాత్రలు వేడిని పట్టుకోలేక గ్యాస్‌ను వృథా చేస్తాయి.

10. స్మార్ట్ పద్ధతులు:

నీళ్లు కాగబెట్టడానికి ఎలక్ట్రిక్ కెటిల్ వాడటం గ్యాస్ కంటే చౌకగా ఉంటుంది. అలాగే బియ్యం, పప్పులను ఒకేసారి 2-3 పూటలకు సరిపడా వండి ఫ్రిజ్‌లో పెట్టుకోవడం వల్ల పదే పదే స్టవ్ వెలిగించే అవసరం తప్పుతుంది. వంటగదిలో మనం పాటించే ఈ చిన్నపాటి జాగ్రత్తలు గ్యాస్ ఆదా చేయడమే కాకుండా, నెలవారీ బడ్జెట్‌ను కూడా అదుపులో ఉంచుతాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>