కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ ప్రజలకు మరింత సమర్థవంతమైన వైద్య సేవలు అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ హెల్త్ కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేవి చాలా మందికి తెలియవు.
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు.. అంటే ఏంటి..?
రోగి ఆస్పత్రికి వచ్చిన మొదటి దశ నుంచి చికిత్స పూర్తయ్యే దాకా ఓపీ, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్, ఫార్మసీ లాంటి అన్ని విభాగాల్లో పేషెంట్ వైద్య చరిత్రను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్, హెల్త్ కార్డు సిద్ధం చేసే విధంగా అవసరమైన ఐటీ సదుపాయాలు, మౌలిక వసతులు, సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ హెల్త్ కార్డు ద్వారా రోగి పూర్తి వైద్య చరిత్ర డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండటం వల్ల వైద్యులు తక్షణమే సరైన చికిత్స అందించేందుకు వీలుంటుంది. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న ఎన్‌సీడీ, కమ్యూనికేబుల్ డిసీజెస్, ఎంసిహెచ్, చైల్డ్ హెల్త్ సేవలు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించి అవసరమైతే రిఫరల్ సిస్టమ్ ద్వారా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు ఈ డిజిటల్ హెల్త్ కార్డు ఉపయోగపడుతుంది. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను అమలు చేయడం ద్వారా పూర్తి వివరాలతో డిజిటల్ హెల్త్ కార్డుల రూపంలో ప్రజల ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉటుంది. కాబట్టి ప్రజల అవసరాలకు అనుగుణంగా చికిత్స, మందులు, ఇతర వైద్యసేవలను అరోగ్య శాఖ త్వరగా అందిస్తుంది. అలాగే ప్రజలు ఆరోగ్య సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లా
ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిస్టమ్, డిజిటల్ హెల్త్ కార్డు మంజూరు ప్రోగ్రామ్ అమలు చేయడానికి సంగారెడ్డి (Sangareddy) జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు అమలులో భాగంగా సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని మొత్తం 64 ప్రభుత్వ జీజీహెచ్ లలో (జీజీహెచ్–1, ఏరియా ఆసుపత్రులు–4, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు–5, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు–4, ప్రైమరీ హెల్త్ సెంటర్లు–31, బస్తీ దవాఖానాలు–19) సేవలు పొందేందుకు వచ్చే ప్రజల సమగ్ర అరోగ్య సమచారంతో డిజిటల్ కార్డులను అందించబోతున్నారు. ఈ మేరకు సంగారెడ్డి కలెక్టరేట్ లో వైద్య అరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా వైద్యాధికారులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు రూపకల్పనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం తీసుకువస్తున్న డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, డిజిటల్ హెల్త్ కార్డు అమలును అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డు అమలు కోసం సంగారెడ్డి జిల్లాలో చేపట్టే ఈ పైలట్ ప్రాజెక్టు ఆదర్శంగా నిలవాలన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చొంగ్తు, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో ఉదయ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

