కలం, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) అన్నారు. జగన్ భద్రతాలోపం పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జగన్ పొగాకు రైతుల పరామర్శకు వెళ్తే కనీస భద్రత కల్పించలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలతో సహా అమిత్ షాకు ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జగన్‌కు భద్రత కల్పించడం లేదని సుబ్బారెడ్డి ఆరోపించారు. అలాగే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, దాడులు, హత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు.

