కలం, వెబ్ డెస్క్ : భారత ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో నిర్వహిస్తున్న ‘ఛలో రాజ్‌భవన్’ నిరసన కార్యక్రమానికి పోలీసులు అడ్డు తగలడం పట్ల ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు, ప్రతిపక్షాలకు లేదా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి లోక్‌భవన్ వైపు ర్యాలీగా బయలుదేరగా, పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్న వేళ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో పోలీసుల తీరును నిరసిస్తూ షర్మిల అక్కడే రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. MODI అంటే “Murder of Democracy in India” (భారతదేశంలో ప్రజాస్వామ్య హత్య) అని వ్యాఖ్యానించారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రశ్నించకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి అంతగా భజన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
అణచివేత ధోరణులతో ముట్టడిని అడ్డుకోవాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్ అయ్యారు. హామీల అమలు కోసం తాము పోరాడుతుంటే, నిరసన తెలపకుండా అడ్డుకోవడం దేనికి సంకేతమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల సాధన కోసం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని, తమ పోరాటాన్ని ఆపేది లేదని ఆమె స్పష్టం చేశారు. గవర్నర్ ను కలిసేందుకు తనను పంపాలని కోరారు.

