కలం, కరీంనగర్: బీజేవైఎం (BJYM) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ‘ఫీజుల బకాయి-బీజేపీ లడాయి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. శుక్రవారం వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు దాదాపు రూ. 15,000 కోట్లు విడుదల చేయలేదని మండిపడ్డారు. నిధుల విడుదల నిలిచిపోవడంతో 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు.
రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, కరీంనగర్ జిల్లాలో కూడా లక్షలాది మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు పడుతూ సతమతమవుతున్నారని తెలిపారు. విద్యార్థులకు న్యాయం జరగాలనే సంకల్పంతో బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజుల బకాయి , బీజేపీ లడాయి పేరిట ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సంగ నరేశ్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వాసుదేవరెడ్డి, గుజ్జ శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు నిర్మలా రెడ్డి, యువ మోర్చా నాయకులు శశిధర్ రెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

