కలం, వెబ్ డెస్క్: రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ చేతుల్లో బందీగా మారిపోయిందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శలు గుప్పించారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలు మోదీ ప్రభుత్వం నియంత్రణలోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. సీబీఐ, ఈడీ సంస్థలపై ఒకప్పుడు వచ్చిన ఆరోపణలే ఇప్పుడు ఎన్నికల సంఘంపైన వస్తున్నాయన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహార శైలిపై వస్తున్న సందేహాలు చాలా తీవ్రమైనవన్నారు. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో సంబంధం లేకుండానే.. 14 సార్లు ఏకపక్ష ఆదేశాలు జారీ చేశారంటేనే అనుమానం కలుగుతోందన్నారు.
ఓటు హక్కు ప్రదానం..
దేశంలో ప్రతి వ్యక్తికి ఓటు హక్కు అనేది అత్యంత ప్రాధాన్యమైన అంశమని వైఎస్ షర్మిల అన్నారు. ప్రజాస్వామ్యంలో పౌరుడికి గొంతుక, విలువను కల్పించే ఆయుధమన్నారు. అలాంటి ఓటు హక్కును స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వేయలేని పరిస్థితి ఉంటే ప్రమాదకరమన్నారు. ఎన్నికల సంఘం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాలన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు సంబంధం లేకుండా జ్ఞానేష్ కుమార్ ఎందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది.. ఎవరైనా ఒత్తిడి చేశారా.. ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు.. అనేది దేశ ఓటర్లకు తెలియాల్సిందేనని షర్మిల స్పష్టం చేశారు.

