కలం, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ (Rohit Sharma) 92 పరుగులకే ఔటయ్యాడు. సెంచరీకి మరో ఎనిమిది పరుగుల దూరంలో ఆగిపోయాడు. అయితే ఈ 92పై సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) కు నిరాశ ఎందుకు? కారణం కేవలం మరో సెంచరీ మిస్ కావడం కాదు. రోహిత్ తన కెరీర్‌ను ఒక ప్రత్యేక రికార్డుతో ముగించాలని గవాస్కర్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 35 వన్డే సెంచరీలు ఉన్నాయి. 2027 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే అవకాశం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అప్పటికి రోహిత్ వయసు 40 ఏళ్లు. అందుకే రిటైర్ అయ్యే సమయానికి అతని వయసు కంటే ఎక్కువ వన్డే సెంచరీలు ఉండాలని గవాస్కర్ కోరుకుంటున్నారు.
మూడో వన్డేలో 100 కొట్టి ఉంటే రోహిత్ 36వ వన్డే సెంచరీ పూర్తి చేసేవాడు. దీంతో ఆ లక్ష్యానికి మరింత దగ్గరయ్యేవాడు. ఒక ఆటగాడి సెంచరీలు అతని వయసును మించితే.. అది అతని సుదీర్ఘ కెరీర్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని గవాస్కర్ భావిస్తున్నారు. ఇదే సమయంలో రోహిత్ బ్యాటింగ్‌లో వచ్చిన మార్పును కూడా గవాస్కర్ ప్రస్తావించారు. 2023 ప్రపంచకప్‌లో తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేవాడని చెప్పారు. ఇప్పుడు మాత్రం తన వికెట్ విలువను గుర్తిస్తూ ఆడుతున్నాడని అన్నారు. భారీ స్కోర్లు చేయగల రోహిత్ నుంచి సెంచరీలు రావడం జట్టుకు ఎంతో ఉపయోగమని గవాస్కర్ పేర్కొన్నారు.

