కలం, నిర్మల్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (Indiramma Family Insurance Scheme) ఈ నెల 19 నుంచి అమల్లోకి రానుందని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈ పథకం అమలుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కుటుంబ పోషకుడైన 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల సభ్యుడికి బీమా వర్తించేలా అర్హతలను పరిశీలించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కౌన్సిలర్లు, వార్డు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన కుటుంబాలకు పథకంపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

