కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్ (YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు తెలిపేందుకు అంగీకరించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యంతో పాటు ప్రాంతీయ సమతుల్యతను కాపాడేలా బిల్లును ప్రవేశ పెడితే.. మద్దతు తెలిపేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే డీ లిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టబోతుందనే చర్చల నేపథ్యంలో వైసీపీ మద్దతు ప్రకటించేందుకు ముందుకు రావడం గమనార్హం. దీనిపై త్వరలోనే జగన్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. వివిధ పార్టీల మద్దతును కూడగట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు వైసీపీతో కూడా మాట్లాడి.. ఈ మేరకు మద్దతు కోరినట్లు చర్చ జరుగుతోంది.
దక్షిణాదికి అన్యాయం చేయొద్దని..
డీ లిమిటేషన్ బిల్లుపై ఈ ఏడాది మార్చిలో జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అందులో ఏ రాష్ట్రానికి లోక్ సభ, రాజ్యసభల్లో ప్రాతినిధ్యం తగ్గించకూడదని, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని కోరారు. అదే సమయంలో చెన్నైలో అప్పటి తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించిన డీ లిమిటేషన్ సమావేశానికి మాత్రం హాజరు కాలేదు. ఏప్రిల్ నెలలో మాత్రం కేంద్రం ప్రతిపాదించిన లోక్ సభ స్థానాల 50 శాతం పెంపు విధానాన్ని మాత్రం జగన్ సమర్థించారు. జనాభా ఆధారం కాకుండా.. అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెంచుతామంటే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో బిల్లుకు అనుకూలంగా ఓటు కూడా వేశారు.

