కలం, వెబ్ డెస్క్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించిన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్పై నమోదు అయిన ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కేసులను ఇకపై రోజువారీ ప్రాతిపదికన విచారించాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.
గత పదేళ్లుగా సీబీఐ ప్రత్యేక కోర్టులో 9 ఈడీ ఛార్జిషీట్లు పెండింగ్లోనే ఉండిపోయాయి. వివిధ నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లు ఇప్పటివరకు తేలకపోవడం వల్లే ప్రధాన విచారణ ముందుకు సాగడం లేదని ఈడీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసుల విచారణను వేగవంతం చేయాలని, అలాగే రోజువారీ విచారణ చేపట్టాలని కోరుతూ ఈడీ ఇప్పటికే ఉన్నత న్యాయస్థానమైన హైకోర్టును కూడా ఆశ్రయించింది.
ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ సహా ఈ కేసుల్లో ఉన్న దాదాపు 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించేందుకు సిద్ధమవుతోంది. పదేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసుల ప్రక్రియలో రోజువారీ విచారణ నిర్ణయం పెద్ద మలుపుగా మారనుంది.

