కలం, లక్ష్మణచాంద: గ్రామాల భద్రత, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) అన్నారు. లక్ష్మణచాంద మండలం చామన్‌పల్లి గ్రామం (Chamanpally Village) లో ప్రజల భాగస్వామ్యంతో సుమారు రూ.1.20 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలంతా ఐక్యంగా ముందుకు వచ్చి భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిందితులను గుర్తించేందుకు, నేరాల నియంత్రణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించవద్దని సూచించారు. ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియాలో ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, వీడియో కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడటం, పెన్షన్లు ఇప్పిస్తామంటూ వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మత్తు పదార్థాలకు బానిసై విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఎస్పీ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సై శ్రావణి, గ్రామ సర్పంచ్ లక్ష్మీ సుదర్శన్, ఉపసర్పంచ్ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ గంగాధర్, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

