కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం చంద్రబాబుకు తొత్తుగా మారిపోయింది అని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ఎస్ఈసీ ఎన్నికల అక్రమాలకు అండగా నిలుస్తోందని విమర్శించారు. ఆదివారం జరగిన దారుణ ఘటనలే ఇందుకు సాక్ష్యం అని పేర్కొన్నారు. పులివెందులలో 80 పోలింగ్ బూత్‌ల్లో 70 చోట్ల వైసీపీ ఏజెంట్లను బూత్ ల్లోకి అనుమతివ్వలేదన్నారు. నాలుగు బూత్‌ల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ఎస్ఈసీ కంటితుడుపు చర్యగా రీపోలింగ్ చేపట్టిందని విమర్శించారు.
అధికార పార్టీ అక్రమాలపై కళ్లు మూసుకుంటే ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ? అని జగన్ ప్రశ్నించారు. ఒక్క పులివెందులలోనే కాదని రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. చాలా మున్సిపాలిటీల్లోనూ యథేచ్చగా అక్రమాలు జరిగాయని చెప్పారు. ఇలా జరిగితే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని, ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తామని జగన్ స్పష్టం చేశారు. ఆలస్యం అయినా చివరకు న్యాయం గెలుస్తాయని ఆయన (YS Jagan) పేర్కొన్నారు.
కాగా, ఆదివారం పులివెందులలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు. తమ ఏజెంట్లను బూత్ ల్లోకి రానివ్వడం లేదని పులివెందుల ఆర్వో కార్యాలయం ఎదుట జగన్ బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఎన్నికల్లో తమకు అన్యాయం జరుగుతుందని ఆయన ఓటు హక్కు వినియోగించుకోలేదు. పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలని జగన్ డిమాండ్ చేశారు.

