కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పశుసంపద అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లావ్యాప్తంగా నవంబర్ 2 నుండి 7 వరకు నట్టల నివారణ (Cattle Deworming) మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శివానంద స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం మూసాపేట మండలం పొల్కంపల్లి గ్రామంలో జిల్లా పశుసంవర్ధక అధికారి స్వామి పశువులకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువుల్లో నట్టల సమస్య కారణంగా వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడటమే కాకుండా పాల ఉత్పత్తి, ఎదుగుదల, పోషక విలువలను గ్రహించే సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. పశువులకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు వేయించడం ద్వారా వాటిని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు పశుపోషకులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో భాగంగా పశుపోషకులు పశువైద్య సిబ్బంది సూచనల మేరకు సరైన మోతాదులో నట్టల నివారణ మందులు వేయించాలని సూచించారు.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పశుపోషకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ పశువులకు నట్టల నివారణ మందులు వేయించి పశుసంపద ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.

