Mobile Popup Ad
Mobile Popup Ad

భారత్ అండర్-19 జట్టులో అర్జున్ రాజ్‌పుత్‌కు చోటు

క‌లం, వెబ్ డెస్క్: రామ్ నగర్ ఇరుకు వీధుల్లో మొదలైన ఒక యువ క్రికెటర్ కల ఇప్పుడు నిజమైంది. ఎన్నో ఏళ్ల కష్టం, కుటుంబం చేసిన త్యాగాలకు ఫలితంగా అర్జున్ రాజ్‌పుత్ (Arjun Rajput) భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే నెల శ్రీలంక పర్యటనకు ఎంపికైన అతడు తొలిసారి భారత జెర్సీ ధరించబోతున్నాడు. ఎడమచేతి బ్యాటర్, కుడిచేతి ఆఫ్-స్పిన్నర్ అయిన అర్జున్‌కు ఇది కెరీర్‌లో పెద్ద మైలురాయి. జూలై 4న జట్టు శ్రీలంకకు బయలుదేరనుండగా, అదే రోజు పర్యటనలో తొలి మ్యాచ్ కూడా జరగనుంది.

అర్జున్ సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి హోతి రామ్ కుల్చాలు తయారు చేస్తూ, బేకరీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కుమారుడి క్రికెట్ ప్రయాణం ఆగకుండా చూసుకున్నాడు. జట్టులో ఎంపికైన తర్వాత అర్జున్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం గర్వంగా ఉందని, శ్రీలంకలో జరిగే అన్ని మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన ఇవ్వడానికి జట్టు పూర్తి ప్రయత్నం చేస్తుందని తెలిపాడు.

ఈ విజయానికి తన కుటుంబం, కోచ్‌ల మద్దతే కారణమని అర్జున్ చెప్పాడు. నిరాశగా ఉన్న ప్రతి సమయంలో తల్లిదండ్రులు, సోదరుడు తనకు ధైర్యం ఇచ్చారని, కోచ్ విక్రమ్ సిద్ధూ, హర్భజన్ అకాడమీ ఎంతో సహకరించాయని పేర్కొన్నాడు. అర్జున్ ఎంపికపై అతని తండ్రి కూడా ఆనందం వ్యక్తం చేశాడు. చిన్నప్పటి నుంచే అర్జున్ క్రికెట్ ఆడుతున్నాడని, అతడు ఎంతో ప్రతిభావంతుడు, కష్టపడే ఆటగాడని చెప్పాడు. తన కుమారుడి కల నెరవేరడం కుటుంబానికి ఎంతో ప్రత్యేక క్షణమని తెలిపాడు.

అర్జున్ తన క్రికెట్ ప్రయాణాన్ని హర్భజన్ సింగ్ క్రికెట్ అకాడమీలో ప్రారంభించాడు. అక్కడే తన నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నాడు. మధ్యలో ఎన్నో సవాళ్లు ఎదురైనా కోచ్ విక్రమ్ సిద్ధూ మార్గదర్శకత్వంలో ముందుకు సాగాడు. శ్రీలంక పర్యటనలో భారత్ అండర్-19 జట్టు మూడు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్‌లు ఆడనుంది. హంబన్‌టోటాలో జూలై 4 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. అనంతరం గాలేలో జూలై 13 నుంచి 16 వరకు తొలి మల్టీ-డే మ్యాచ్ జరుగుతుంది. పర్యటనలో చివరి మ్యాచ్ జూలై 20 నుంచి 23 వరకు కొలంబోలో నిర్వహించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>