పిల్లలకు శ్రీరామ్ ఫైనాన్స్ చేయూత అభినందనీయం: యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఆటో డ్రైవర్లు, కమర్షియల్ వెహికల్ డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ వాహనాల డ్రైవర్లు, రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ స్కాలర్‌షిప్‌లను (Shriram Finance Scholarships) పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని రాజా బహదూర్ రెడ్డి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రవాణా రంగాన్ని జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, ప్రతి సంవత్సరం వారికి స్కాలర్‌షిప్‌లు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 750 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం సంతోషకరమన్నారు.

కేవలం హైస్కూల్ విద్యార్థులకే పరిమితం కాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సైతం స్కాలర్‌షిప్‌లు అందించడం ద్వారా ఉన్నత విద్యకు సంస్థ అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే (Yennam Srinivas Reddy) తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారి చదువుకు ఆర్థిక సహకారం అందించడం వల్ల వారు మరింత ఉత్సాహంతో ముందుకు సాగేందుకు అవకాశం కలుగుతుందన్నారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి ఎస్ ఆర్) నిధులను ఖర్చు చేసే సమయంలో సమాజానికి నిజంగా అవసరమైన రంగాలను గుర్తించి, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలని  సూచించారు. ముఖ్యంగా విద్యారంగంపై పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన అవకాశాలను కల్పించవచ్చని అన్నారు. రవాణా రంగ కార్మికుల పిల్లలను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రోత్సాహం అందించడం శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థకు సమాజం పట్ల ఉన్న బాధ్యతకు నిదర్శనమని కొనియాడారు.

విద్య పట్ల ఇంతటి శ్రద్ధ చూపిస్తూ, కోట్లాది రూపాయలను విద్యార్థుల భవిష్యత్తు కోసం వెచ్చించేందుకు ముందుకు వచ్చిన శ్రీరామ్ ఫైనాన్స్ గ్రూప్ యాజమాన్యానికి, సంస్థలో పనిచేస్తున్న సీనియర్ అధికారులు, ఉద్యోగులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపట్టి విద్యార్థుల విద్యాభివృద్ధికి, వారి ఉన్నత లక్ష్యాల సాధనకు సంస్థ అండగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్య, కార్పొరేటర్లు గిరి గౌడ్, తిరుమల వెంకటేష్, తాహెర్, రమేష్ రెడ్డితో పాటు శ్రీరాం ఫైనాన్స్ ఉద్యోగులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : తుమ్మిడిహెట్టి పేరుతో కాలయాపన : ఎర్రబెల్లి దయాకర్‌రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>