పట్టభద్రుల ఓటర్ల నమోదుపై పువ్వాడ అజయ్ ఫోకస్

కలం, ఖమ్మం బ్యూరో : రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను (Graduate MLC Elections) పురస్కరించుకుని ఖమ్మం నగరంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని ముస్తఫా నగర్, గాంధీ చౌక్, జిల్లా కోర్టు, ఎస్‌బీఐటీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన ఓటర్ల నమోదు కేంద్రాలను పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా పువ్వాడ (Puvvada Ajay Kumar) మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల ప్రకారం గతంలో ఓటు ఉన్నవారు కూడా ఈసారి తప్పనిసరిగా కొత్తగా ఓటు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో ఓటు ఉందనే ధీమాతో ఉండకుండా, ప్రతి పట్టభద్రుడితో మళ్లీ దరఖాస్తు పూర్తి చేయించే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు. గత ఎన్నికల డేటా ఆధారంగా డివిజన్లు, ఇంటి నంబర్ల వారీగా పట్టభద్రులను గుర్తించి ఫోన్ల ద్వారా సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని, ఫోన్లకు అందుబాటులో లేనివారి ఇళ్లకు నేరుగా వెళ్లి ఓటు నమోదు చేయించడంపై దృష్టి పెట్టాలని కోరారు. పట్టభద్రుల ఎన్నికల్లో లీగల్ సెల్ పాత్ర ఎంతో కీలకమని, న్యాయవాదులు ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించేలా చొరవ చూపాలని తెలిపారు.

అలాగే ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, నివాస ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి ఒక్కరితో ఓటు నమోదు చేయించాలని సూచించారు. గత మూడేళ్లలో పట్టభద్రులైన నూతన అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఓటర్ల నమోదుకు తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉన్నందున ప్రతి కార్యకర్త రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. సభలు, ఉపన్యాసాలు ఇవ్వడం కంటే క్షేత్రస్థాయిలో చేసే శ్రమే ఎన్నికల్లో పార్టీ విజయానికి పునాది అవుతుందని పేర్కొన్నారు.

ఖమ్మం నగర పరిధిలోని అన్ని డివిజన్లలో నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత డివిజన్ సమన్వయకర్తలు, బాధ్యులతో స్వయంగా మాట్లాడి సమీక్షిస్తానని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు నిరంతరం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు నాయకులందరూ క్రియాశీలకంగా పాల్గొని పట్టభద్రుల ఓటర్ల నమోదును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్జేసీ కృష్ణ, బచ్చు విజయ్ కుమార్, పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Also Read : తుమ్మిడిహెట్టి పేరుతో కాలయాపన : ఎర్రబెల్లి దయాకర్‌రావు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>