కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్‌లో జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు (Bhaskar Rao) అధ్యక్షతన నిర్వహించారు. దివ్యాంగుల సంక్షేమం(Disability Welfare), హక్కుల పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో సమీక్షించారు. దివ్యాంగులకు UDID కార్డులు, సదరం సర్టిఫికెట్లు, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ, దివ్యాంగ పిల్లల విద్య, వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలపై అధికారులతో చర్చించారు. జిల్లాలో అర్హులైన దివ్యాంగులందరికీ UDID కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బ్యాక్‌లాగ్ ఖాళీలను నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని సూచించారు.
దివ్యాంగ పిల్లలు పాఠశాలలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా తల్లిదండ్రులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. భువనగిరి జనరల్ హాస్పిటల్‌లో దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆసుపత్రిలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సదరం అసెస్‌మెంట్ క్యాంపుల వద్ద దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించేందుకు అటెండెంట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
దివ్యాంగులకు ప్రైవేట్ రంగంలో, ముఖ్యంగా ఐటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ‘యూత్ ఫర్ జాబ్స్’ సంస్థతో సమన్వయం చేసుకోవాలని భాస్కర్ రావు సూచించారు. దివ్యాంగుల హక్కులు, చట్టపరమైన రక్షణలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని, వారి సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల చిన్నచూపు చూపినా, వివక్షకు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస్, జిల్లా ఉపాధి అధికారి పద్మ, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వీరన్న, MEPMA అధికారులు, జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సభ్యులు, దివ్యాంగుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

