కలం, వెబ్ డెస్క్: తన ఫామ్ హౌస్ లో సర్వే చేసేందుకు కేసీఆర్ ముందుకు రావాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎల్పీ మీడియా సెంటర్ లో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తో కలిసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి 308 ఎకరాల భూమి ఉందని హరీశ్ రావు నోటికొచ్చినట్లు కూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. హరీశ్ రావు దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టాలన్నారు.
బీఆర్ఎస్ నేతలు పదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కల్వకుంట్ల కుటుంబ భూ దోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టారని చెప్పారు. భూ దోపిడీ బయటపడడంతో హరీశ్ రావు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఇది ట్రైలర్ మాత్రమేనని.. ముందుంది ముసళ్ల పండుగ అంటూ విమర్శించారు.
కేసీఆర్‌కు హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేదని హరీశ్ రావు బుకాయిస్తున్నారని ఆదిశ్రీనివాస్ మండిపడ్డారు. నందినగర్‌లో ఇల్లు కేసీఆర్‌ది కాదా? ఎర్రవల్లిలో ఫామ్‌హౌస్ లేదా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌కు గచ్చిబౌలిలో విల్లాలు, జన్వాడలో ఫామ్‌హౌస్‌లు లేవా? అని నిలదీశారు. వందల ఎకరాల కుటుంబంలో కేసీఆర్ పుట్టాడని హరీష్ రావు అంటున్నారని.. అయితే కేసీఆర్ తండ్రికి ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయో ముందు చెప్పాలన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తు లు ఎన్ని? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. వ్యవసాయ భూముల బండారాన్నే సీఎం బయటపెట్టారని.. త్వరలోనే మరిన్ని విషయాలు బయటపెడతారని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు హరీశ్ రావు సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో హరీశ్ రావు అసహనంతో ఉన్నాడని చెప్పుకొచ్చారు. 22 ఏళ్లుగా తలెత్తిన సమస్యలకు మా ముఖ్యమంత్రి పరిష్కారం చూపించారు. 12 సమస్యలకు గడువుతో కూడిన పరిష్కారం చూపించారని అన్నారు.
హరీశ్ రావు నోటికొచ్చినట్లు అబద్ధాలు చెబితే తెలంగాణ ప్రజలు నమ్మరని ఆది శ్రీనివాస్ విమర్శించారు. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెబుతున్నప్పటికీ హరీష్ రావు అసహనంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకొని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నంబర్లతో సహా కల్వకుంట్ల కుటుంబ ఆస్తులను సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని చెప్పారు.

