కలం, వెబ్ డెస్క్: 2026 మహిళా టీ20 వరల్డ్ కప్ (Womens T20 World Cup)కు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందే 2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని టోర్నమెంట్ డైరెక్టర్ బెత్ బారెట్-వైల్డ్ వెల్లడించారు. మహిళల క్రికెట్‌ను మరింత మంది అభిమానులకు చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్వాహకులు ముందుకు సాగుతున్నారని ఆమె తెలిపారు. ఈ మెగా టోర్నీలో 12 జట్లు పాల్గొనగా, మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 12న ఎడ్జ్‌బాస్టన్‌లో పోటీలు ప్రారంభమై, జూలై 5న లార్డ్స్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తాయి. ఇంగ్లాండ్‌లో 2009 తర్వాత మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహించబడుతోంది.
మొత్తం 2.70 లక్షల టికెట్లు విక్రయించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యం నెరవేరితే 2020లో ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ హాజరు రికార్డును రెట్టింపు చేసినట్లవుతుందని బెత్ తెలిపారు. ఇప్పటికే 2 లక్షల టికెట్లు విక్రయమవడం మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు. టికెట్ విక్రయాల గణాంకాల్లో కూడా ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కొనుగోలు చేసిన టికెట్లలో 36 శాతం మహిళలవని, ఇది తమ ప్రధాన క్రికెట్ టోర్నీలన్నింటిలోకెల్లా అత్యధిక శాతమని నిర్వాహకులు వెల్లడించారు.
అలాగే గణనీయ సంఖ్యలో కుటుంబాలు, యువ అభిమానులు కూడా టోర్నీపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. మహిళల క్రికెట్‌ను కేవలం ప్రత్యేక విభాగంగా కాకుండా ప్రధాన క్రీడగా గుర్తించేలా చేయడమే ఈ టోర్నీ లక్ష్యమని బెత్ చెప్పారు. అందుకోసం పురుషుల ప్రపంచ టోర్నీల మాదిరిగానే అత్యాధునిక ప్రసార సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలిపారు. మహిళల ఆటలోని ప్రత్యేకతలను, నైపుణ్యాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చూపించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. దీంతో ఈ టోర్నీపై అంచనాలు మరింత పెరిగాయి.

