కలం, సినిమా : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి ఆసక్తికర చర్చకు తెరతీశారు. “ప్రస్తుత విద్యా వ్యవస్థను చంపేయాలి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్జీవీ అభిప్రాయం ప్రకారం, దశాబ్దాలుగా కొనసాగుతున్న విద్యా విధానం ఇప్పటి కాలానికి అనుగుణంగా లేదని, AI యుగంలో దానిని పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటి విద్యా వ్యవస్థ విద్యార్థులను ఆలోచించే వ్యక్తులుగా కాకుండా, సమాచారాన్ని కంఠస్థం చేసి పరీక్షలలో రాసే యంత్రాలుగా తయారు చేస్తోంది. “చదువు.. పరీక్ష.. డిగ్రీ.. ఉద్యోగం” అనే ఒకే పాత సూత్రాన్ని సమాజం ఇప్పటికీ అనుసరిస్తోందని విమర్శించారు. ఒకప్పుడు పుస్తకాలలో మాత్రమే లభించే సమాచారం ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోని మొబైల్లో, AI రూపంలో క్షణాల్లో అందుబాటులో ఉంది. అలాంటప్పుడు సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడమే విద్య లక్ష్యంగా ఉండటం సమంజసం కాదని అన్నారు.
వైద్య విద్యను ఉదాహరణగా తీసుకున్న వర్మ, ఒక విద్యార్థి MBBS, పోస్ట్‌గ్రాడ్యుయేషన్, సూపర్ స్పెషలైజేషన్ పూర్తి చేయడానికి దాదాపు పదేళ్ల సమయం వెచ్చిస్తాడని గుర్తుచేశారు. అయితే, అదే సమయంలో AI కొన్ని సెకన్లలో లక్షలాది వైద్య రికార్డులను విశ్లేషించి, వ్యాధులను గుర్తించి, చికిత్సలకు సంబంధించిన సూచనలు ఇవ్వగలుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యులు చేసే ప్రధాన పని వైద్య పరీక్షల ఫలితాలను విశ్లేషించడం, వ్యాధిని నిర్ధారించడం, చికిత్స సూచించడం ఇవన్నీ AI మరింత వేగంగా, ఎక్కువ ఖచ్చితత్వంతో చేయగలదని అన్నారు.
AI అభివృద్ధికి పునాదులు వేసిన ప్రముఖ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ వంటి వారు కూడా భవిష్యత్తులో మానవ సామర్థ్యాలను అధిగమించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారని వర్మ ప్రస్తావించారు. “అయితే ఇప్పటికీ విద్యార్థులు ఎందుకు పాత పద్ధతిలోనే NEET వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నారు? కేవలం సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో వైద్య నిర్ధారణలు, శస్త్రచికిత్సలు రోబోటిక్స్ సాంకేతికతతో జరిగే అవకాశాలు పెరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ విద్యా విధానం కాకుండా, నైపుణ్యాలను పెంచే విద్య అవసరమని పేర్కొన్నారు.
ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న మరో సమస్యను కూడా ఆర్జీవీ ప్రస్తావించారు. “ఇది సిలబస్‌లో ఉంది” అని ఉపాధ్యాయులు, “అందరూ ఇదే చేస్తున్నారు” అని తల్లిదండ్రులు చెప్పడం వల్ల విద్యార్థులు ప్రశ్నించే సామర్థ్యాన్ని కోల్పోతున్నారని విమర్శించారు. “నా ఫోన్లో ఉన్న సమాచారాన్ని నేను ఎందుకు కంఠస్థం చేయాలి?” అని ప్రశ్నించే విద్యార్థులను సమాజం అర్థం చేసుకోవడం లేదని వర్మ అన్నారు.

