కలం, నిర్మల్: మహిళల ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీజీఎస్ ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని (TGSRTC Free Bus) ఒక్కొక్కరూ ఒక్కో తీరుగా వాడేస్తున్నారు. ప్రయాణ సమయంలో కొందరు మహిళలు బీడీలు చుట్టడం, కూరగాయలు తరగడం వంటి పనులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయ. తాజాగా తొగరి కాయలు (సోలాలు) వలిచిన ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం ఆదిలాబాద్ నుంచి నిర్మల్‌కు వస్తున్న పల్లె వెలుగు బస్సులో ఇద్దరు మహిళలు ప్రయాణించారు. బస్సులో వెళ్తూ మార్గమధ్యలో సీట్లలో కూర్చొని తీరిగ్గా తొగరి కాయలు వలిచారు.
ఆ మహిళలను చూసిన వాళ్లు ఫ్రీ బస్సును ఇలా కూడా వాడుతున్నారా అని షాకయ్యారు. అయితే, సదరు మహిళలు వాటి తొక్కలను బస్సులోనే పడేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు, ప్రజా రవాణా వాహనాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

