కలం, యాదాద్రి భువనగిరి: అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరతతో రోగులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు పడింది. భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ (Oxygen Plant) అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా సామర్థ్యం మరింత పెరగనుంది.
శనివారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam Anil Kumar), జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో కొనసాగుతున్న వివిధ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పనుల పురోగతి, నాణ్యత, ప్రస్తుత పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణాల్లో జాప్యానికి తావివ్వొద్దు!
ఆసుపత్రిలో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద, మధ్యతరగతి రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి, వైస్ చైర్మన్ మంజుల, ఆసుపత్రి సూపరింటెండెంట్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

