కలం, మహబూబాబాద్ : భర్తను హత్య చేయాలంటూ ఓ వివాహిత తన ప్రియుడితో వాట్సాప్‌లో చాటింగ్ చేసినట్లు వెలుగులోకి రావడం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ (Dornakal) మండలం చిలుకోడులో కలకలం రేపింది. తన భార్య భవానీ, ఆమెకు పరిచయమైన కొరియర్ బాయ్ సైదులు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ గాదె రాజేశ్వరరావు డోర్నకల్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రాజేశ్వరరావు ఫిర్యాదు ప్రకారం.. 2016లో భవానీతో తనకు వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తాను పనిచేస్తున్నట్లు తెలిపాడు. గత కొంతకాలంగా భార్య ప్రవర్తనలో మార్పు గమనించానని, ఖమ్మంలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్న సైదులతో ఆమెకు పరిచయం ఏర్పడి సన్నిహిత సంబంధంగా మారిందని ఆరోపించాడు. తాను ఇంట్లో లేని సమయంలో సైదులు ఇంటికి వచ్చి వెళ్తున్నాడని, తనను అడ్డు తొలగిస్తే ఇద్దరూ కలిసి జీవించవచ్చనే ఉద్దేశంతో తనను హత్య చేయాలని భార్య ప్రియుడిని ప్రోత్సహించిందని రాజేశ్వరరావు ఆరోపించాడు.
‘యాక్సిడెంట్‌గా చూపించు’?
భార్య, సైదుల మధ్య జరిగినట్లు చెబుతున్న వాట్సాప్ చాటింగ్ స్క్రీన్‌షాట్లను రాజేశ్వరరావు పోలీసులకు అందజేశాడు. తన భర్తను చంపాలని, ఇంట్లో ఘటన జరిగితే తనపై అనుమానం వచ్చే అవకాశం ఉందని.. ప్రమాదంగా చిత్రీకరించాలని చాటింగ్‌లో సూచించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రియుడు చర్య తీసుకోకపోతే తానే భర్తను చంపేస్తానని భార్య చెప్పినట్లు కూడా ఆరోపించాడు.
ఈ చాటింగ్ ఆధారంగా తనకు, తన ఇద్దరు కుమార్తెలకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని రాజేశ్వరరావు పోలీసులను కోరాడు. ఫిర్యాదు, సమర్పించిన ఆధారాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. చాటింగ్ నిజమైనదేనా? అందులోని సందేశాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? హత్యకు సంబంధించి ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

