కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) నగరంలోని దేశాయిపేట (Desaipet) లో మాధవి అనే ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల వేధింపులే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ ఆమె రాసిన లేఖ బయటపడటంతో విషయం సంచలనంగా మారింది. లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం, సుమారు 12 రోజుల క్రితం తన భర్తను పోలీసులు తీసుకెళ్లారని, అయితే ఇప్పటి వరకు ఆయన ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని మాధవి ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బతికి ఉన్నాడా? లేదా చనిపోయాడా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొంది.
మామునూరు ఏసీపీ, ఎనుమాముల సీఐ, ఎస్సైలను ఈ ఘటనకు బాధ్యులుగా ఆమె సూసైడ్ నోట్లో ప్రస్తావించింది. అంతేకాకుండా తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించింది. ఈ వ్యవహారంలో కొంతమంది మార్కెట్ వ్యాపారుల పాత్ర కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

