కలం, ఖమ్మం బ్యూరో : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మంలో చేపట్టిన అభివృద్ధి ఆనవాళ్లను చెరిపివేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో నిర్మించిన మున్నేరు చెక్‌డ్యాం, కలెక్టరేట్, ఐటీ హబ్, పోలీస్ కమిషనరేట్, బస్‌స్టాండ్ వంటి ప్రజా ఉపయోగకర కట్టడాలను కూల్చివేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అభివృద్ధి చరిత్రను ఎవరూ చెరిపేయలేరని స్పష్టం చేశారు.
అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా నిరాశపరిచిందని, ఖమ్మం నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా వంద శాతం రైతు రుణమాఫీ జరిగిందో బహిర్గతం చేయాలని తుమ్మలకు సవాల్ విసిరారు. నగరంలో చెత్త తొలగించక పారిశుధ్యం పడకేసిందని, విద్యుత్ కోతలు, ఆసుపత్రులలో సౌకర్యాల లేమి రోడ్లపై గుంతలు పూడ్చలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై వ్యక్తిగత దూషణలకు దిగడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమని, ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని, తగిన సమయంలో ప్రజలే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

