కలం, నారాయణపేట: జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమం, ఇతర సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు (Narayanpet Journalists) నిరసన చేపట్టారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీనగర్ లోని గాంధీ విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు. ఆ తర్వాత జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గాంధీ విగ్రహానికి అందించారు. అనంతరం శ్రీ గార్డెన్‌లో కలెక్టర్ ప్రియాంక, ఎంపీ డీకే అరుణకు జర్నలిస్టుల సమస్యలను వివరించి వినతిపత్రం అందించారు.
జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని, వినతిపత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించాలని కోరారు. జర్నలిస్టులకు భద్రత, సామాజిక భద్రత, సంక్షేమం కల్పించడంతో పాటు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజెయూ)నాయకులు కోరారు. కార్యక్రమంలో నారాయణపేట జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

