కలం, వెబ్ డెస్క్: దేశంలో యూపీఐ లావాదేవీల (UPI Payments) సంఖ్య తగ్గినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ డేటా తాజాగా వెల్లడించింది. ఆగస్టులో రూ.29.82 లక్షల కోట్ల లావాదేవీలు నమోదు కాగా.. సెప్టెంబరులో రూ.29.37 లక్షల కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. పేమెంట్స్ 1.5 శాతం తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబరు నెలలో ఒక రోజు తక్కువగా ఉండటమే దీనికి కారణమని చెబుతున్నా.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ దీనికి మరో కారణంగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సాధారణ వినియోగదారులపైన భారం పడబోదని కేంద్రం ఎప్పటికప్పుడు చెబుతున్నా.. ఆ భారాన్ని తాము భరించలేమని వ్యాపారులు తేల్చి చెబుతున్నారు. తిరిగి వినియోగదారులపైనే భారం మోపడం లేదా యూపీఐ స్థానంలో నోట్లు స్వీకరించడం తమ ముందు ఉన్న ఆప్షన్లు అని చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో యూపీఐ చెల్లింపులు స్వీకరించబోమంటూ బోర్డులు కూడా దర్శనమిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
రోజుకు రూ.80 కోట్ల లావాదేవీలు..
సెప్టెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల్లో మరో రికార్డ్ నమోదైంది. రోజుకు సగటున రూ.80.2 కోట్ల చెల్లింపులు జరిగాయని NPCI డేటా పేర్కొంది. అయితే మొత్తంగా చూసినప్పుడు 2025 సెప్టెంబర్ నెలతో పోలిస్తే 2026 సెప్టెంబర్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య 23 శాతానికి పెరిగింది. గత మే నెలలో యూపీఐ చెల్లింపుల విలువ రూ.29.90 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది ఆల్ టైం రికార్డుగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రం ఎండీఆర్ ఛార్జీలు విధిస్తామని చెప్పినా.. ప్రస్తుతానికి యూపీఐ పేమెంట్స్ జోరు తగ్గలేదు. రాబోయే నెలల్లో దీని ప్రభావంపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

