కలం, వనపర్తి: ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారంటూ వనపర్తి ఎమ్మెల్యే (Wanaparthy MLA) తూడి మేఘా రెడ్డి (Tudi Megha Reddy) ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
శనివారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గంలో సుమారు 2.75 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 35 వేలకుపైగా ఓట్లను తొలగించారని మేఘారెడ్డి ఆరోపించారు. మరికొందరికి నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించాల్సిన ఎన్నికల సంఘం తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
అర్హుల ఓట్లు తొలగించొద్దు
సర్ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే పరిస్థితి ఏర్పడిందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు, తొలగింపులకు సంబంధించిన పూర్తి వివరాలను రాజకీయ పార్టీలు, ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మిగిలిన ఓటర్లకు ప్రత్యేక డ్రైవ్
సర్ అనంతరం జాబితాలో మిగిలిపోయిన అర్హులైన ఓటర్లను గుర్తించి తిరిగి చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించిన విషయాన్ని నేతలు ప్రస్తావించారు. ప్రీ-సర్ జాబితాలో పేరుండి ప్రస్తుత జాబితాలో పేరు కనిపించని ఓటర్లతోపాటు తొలిసారి ఓటు హక్కు పొందే యువతను కూడా ప్రక్రియలో చేర్చాలని కోరారు.
దేశవ్యాప్త ఉద్యమం
ఓటు హక్కు పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజలను చైతన్యవంతం చేస్తామని, యువతను భాగస్వామ్యం చేస్తూ ఉద్యమాన్ని విస్తరిస్తామని తెలిపారు. అవసరమైతే ఢిల్లీలోనూ భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సర్ ప్రక్రియపై అభ్యంతరాలున్న ఓటర్లకు తగిన అవకాశం కల్పించి, వారి పేర్లను పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు.
విలేకరుల సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి రమేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జబ్బార్, డి.కురుమయ్య, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రహీం, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు ఖాదర్‌బాషా, బాబు గౌడ్, గణేష్, మండ్ల రాజు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, కోళ్ల వెంకటేష్, బి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

