కలం, వనపర్తి: పర్యాటకులను ఆకర్షించేలా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వర్షాభావ పరిస్థితులు, నీట్–పీజీ పరీక్షల ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వనపర్తి (Wanaparthy) కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు ఖీమ్య నాయక్, వినోద్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని సీఎస్ (CS Sanjay Jaju) సూచించారు. జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను పరస్పరం అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో రహదారులు, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, పారిశుద్ధ్యం, సూచిక బోర్డులు, ఇతర సందర్శకుల సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు. ప్రతి పర్యాటక ప్రాంతానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, బాధ్యతలు, కాలపరిమితి నిర్ణయించాలని తెలిపారు. స్థానిక కళలు, హస్తకళలు, ఆహారం, సంస్కృతికి ప్రాధాన్యం కల్పిస్తూ స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలని, హోమ్‌స్టేలు, స్థానిక గైడ్ సేవలను ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి, కళలు, చారిత్రక వారసత్వం, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసి ‘బ్రాండ్ తెలంగాణ’కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని తెలిపారు.
వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో ప్రస్తుతం 22 శాతం లోటు వర్షపాతం నమోదైందని, సెప్టెంబర్ చివరి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు సూచించినట్లు సీఎస్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.20 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, గత వానాకాలంలో 1.38 కోట్ల ఎకరాల్లో సాగు జరిగినట్లు వివరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల పరిస్థితి, సాగునీరు, తాగునీటి లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు.
వ్యవసాయం, సాగునీరు, తాగునీటి లభ్యతపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరికి బదులుగా మినుములు, వేరుశనగ తదితర ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆరుతడి పంటల సాగుపై రైతులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా పర్యాటక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో యాదయ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుధీర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : హాకీ వైఫల్యంపై పిఆర్ శ్రీజేష్ ఘాటు వ్యాఖ్యలు!
Follow Us On : WhatsApp

