కలం, నిర్మల్: సారంగాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు, కేసుల దర్యాప్తు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచడంతో పాటు రాత్రి గస్తీని ముమ్మరం చేసి దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. మహిళలు, బాలల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బీట్ వ్యవస్థను పటిష్టం చేసి గ్రామాల్లో నిరంతరం పర్యటించాలని సూచించారు. డయల్ 112 సమాచారం అందిన వెంటనే స్పందించాలని, విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఈ తనిఖీలో డీఎస్పీ శ్రీనివాస్, నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు.

