కలం, స్పోర్ట్స్ : ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) మరో వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్‌పై లార్డ్స్ టెస్టులో విజయం తర్వాత జరిగిన నైట్‌క్లబ్ ఘటనపై ECB విచారణ ప్రారంభించింది. స్టోక్స్, గస్ అట్కిన్సన్ జట్టు విధించిన అర్ధరాత్రి కర్ఫ్యూను ఉల్లంఘించినట్లు సమాచారం. ఈ సమయంలో చెల్సియాలోని ఓ నైట్‌క్లబ్ వద్ద జరిగిన గొడవలో ఇద్దరి పేర్లు వినిపించాయి. నివేదికల ప్రకారం, ఓ సరాసెన్స్ అకాడమీ రగ్బీ ఆటగాడు అట్కిన్సన్‌పై దాడి చేయడానికి ప్రయత్నించగా, ఆ పంచ్ పొరపాటున ECB భద్రతా సిబ్బందికి తగిలింది. దీంతో అతడికి కుట్లు వేయాల్సి వచ్చింది. అయితే ఈ గొడవలో స్టోక్స్, అట్కిన్సన్ దాడి చేసినవారు కాదని ECB వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలే ఆటగాళ్ల ప్రవర్తనపై ECB కఠిన నిబంధనలు అమలు చేసిన నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. విచారణ కొనసాగుతుండటంతో స్టోక్స్ కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండో టెస్టుకు స్టోక్స్, అట్కిన్సన్ దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిస్థితుల్లో వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జట్టును నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ECB విచారణ పూర్తయ్యే వరకు ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

