రేపే వినాయక చవితి.. పూజాకు శుభ ముహుర్తాలు ఇవే!

కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగకు (Vinayaka Chavithi 2026) ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడిని ఇంటికి ఆహ్వానించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అయితే 2026లో చవితి తిథి రెండు తేదీల్లో ఉండటంతో పండుగను సెప్టెంబర్ 14న జరుపుకోవాలా? లేక 15న నిర్వహించాలా? అనే సందేహం భక్తుల్లో నెలకొంది.

పంచాంగ గణితం, పండుగ నిర్ణయానికి సంబంధించిన శాస్త్ర నియమాలను పరిశీలించిన పండితులు సెప్టెంబర్ 14, సోమవారం రోజునే వినాయక చవితి జరుపుకోవడం శాస్త్రసమ్మతమని సూచిస్తున్నారు. చవితి తిథి సెప్టెంబర్ 14 ఉదయం 7:11 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 15 ఉదయం 7:44 గంటల వరకు కొనసాగుతుంది.

మధ్యాహ్న వ్యాప్తికే ప్రత్యేక ప్రాధాన్యత

వినాయక చతుర్థి విషయంలో సాధారణ తిథి నియమంతో పాటు మధ్యాహ్న వ్యాప్తికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు. పురాణ విశ్వాసాల ప్రకారం గణపతి మధ్యాహ్న సమయంలో అవతరించినట్లు నమ్మకం. అందువల్ల చవితి తిథి మధ్యాహ్న సమయంలో ఉండే రోజునే ప్రధానంగా పరిగణిస్తారు.

2026లో సెప్టెంబర్ 14న మధ్యాహ్న సమయంలో చవితి తిథి కొనసాగుతుంది. సెప్టెంబర్ 15న ఉదయం 7:44 గంటలకే తిథి ముగియనుండటంతో ఆ రోజున మధ్యాహ్న వ్యాప్తి ఉండదు. ఈ కారణంగానే సెప్టెంబర్ 14న పండుగ నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

గణపతి ప్రతిష్ఠకు శుభ ముహూర్తాలు

సెప్టెంబర్ 14న గణపతి విగ్రహ ప్రతిష్ఠ, పూజలకు అనుకూలమైన సమయం ఉదయం 11:05 గంటల నుంచి మధ్యాహ్నం 1:35 గంటల వరకు ఉంటుందని పంచాంగ వివరాలు సూచిస్తున్నాయి. అలాగే అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:09 నుంచి 12:58 గంటల వరకు ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ సమయంలో గణపతిని ప్రతిష్ఠించి షోడశోపచార పూజలు నిర్వహించడం విశేష ఫలప్రదమని ఆధ్యాత్మిక విశ్వాసం. ప్రాంతాన్ని బట్టి పంచాంగ సమయాల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది.

శుభ యోగాలతో మరింత విశేషం

ఈ ఏడాది సెప్టెంబర్ 14న బ్రహ్మ యోగం, ఇంద్ర యోగం వంటి శుభ యోగాలు ఉన్నట్లు పంచాంగ గణితం చెబుతోంది. మధ్యాహ్నం 1:55 గంటల వరకు చిత్రా నక్షత్రం, అనంతరం స్వాతి నక్షత్రం కొనసాగుతుందని వివరాలు సూచిస్తున్నాయి. అయితే అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 15న పూజ చేయాల్సి వస్తే చవితి తిథి ముగిసేలోపు, అంటే ఉదయం 7:44 గంటలలోగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. ప్రధానంగా సెప్టెంబర్ 14నే వినాయక చవితి, గణపతి ప్రతిష్ఠకు అనుకూలమైన రోజుగా పేర్కొంటున్నారు.

గమనిక: పూజా ముహూర్తాలు ప్రాంతీయ పంచాంగాలు, స్థానిక ఆచారాల ఆధారంగా స్వల్పంగా మారవచ్చు. ఖచ్చితమైన సమయాల కోసం స్థానిక పండితులు లేదా సంబంధిత పంచాంగాన్ని సంప్రదించడం ఉత్తమం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>